పరీక్షలంటే భయం, బెరుకు అస్సలు ఉండవు.. టాపర్లు ఫాలో అయ్యే సీక్రెట్స్ ఇవే

అందరు విద్యార్థులు చదువులో రాణించాలని, మంచి మార్కులు సాధించాలని కోరుకుంటారు. కానీ కొందరికి మాత్రమే విజయం దక్కుతుంది. ఇతర విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా టాపర్‌లుగా నిలిచిన వాళ్లు కొన్ని ప్రత్యేక స్ట్రాటజీలు ఫాలో అవుతారు. మంచి అలవాట్లతో ఎక్కువ మార్కులు సాధిస్తుంటారు. అలాంటి టాపర్ల సీక్రెట్ స్టడీ హ్యాబిట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.


తెల్లవారుజామునే లేవాలి
చాలామంది టాపర్లు తమ రోజును తెల్లవారుజామునే ప్రారంభిస్తారు. సాధారణంగా ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తారు. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడానికి, రోజును ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. రోజును ఎర్లీగా ప్రారంభించడం వారికి ఒక రకమైన అడ్వాంటేజ్‌ని ఇస్తుంది.

తమతో తామే మాట్లాడుకుంటారు
ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ టాపర్లు చదువుకునేటప్పుడు తమతో తామే మాట్లాడుకుంటారు. పాఠాలను గట్టిగా చదువుతూ, తమకు తాముగా అర్థమయ్యేలా వివరించుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారు టాపిక్స్ బాగా అర్థం చేసుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఆలోచనలను మాటల్లోకి మార్చడం అనేది వారి మెదడులో ఆ విషయాన్ని మరింత బలంగా ముద్ర వేస్తుంది.

పవర్ న్యాప్స్
టాపర్లు గంటల తరబడి కంటిన్యూగా చదవరు. మధ్యమధ్యలో చిన్న కునుకులు తీస్తారు. 15-20 నిమిషాల పవర్ న్యాప్ వారి మెదడును రీఫ్రెష్ చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది, అలాగే సమాచారాన్ని మరింత సమర్థవంతంగా గుర్తుంచుకునేలా చేస్తుంది. దీనివల్ల చదువుపై ఫోకస్ పెరుగుతుంది.

మెదడుకు మేలు చేసే ఆహారం
టాపర్లు తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహిస్తారు. వారు నట్స్, బెర్రీలు, చేపలు వంటి మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాలను తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తమ అకడమిక్ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుందని వారు నమ్ముతారు.

నడుస్తూ చదువుతారు
కొంతమంది టాపర్లు గదిలో అటూ ఇటూ నడుస్తూ చదువుతారు లేదా నోట్స్ చదువుతారు. ఇలా కదలడం వల్ల వారు శారీరకంగా చురుకుగా ఉంటారు. అలాగే విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకే చోట కూర్చొని చదవడం కంటే ఇది భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

ఫన్నీ టెక్నిక్స్‌
టాపర్లు కష్టమైన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఫన్నీ టెక్నిక్స్ (Funny Mnemonics) ఉపయోగిస్తారు. ఎంత వింతగా ఒక విషయాన్ని మార్చేస్తే అంత సులభంగా, అంత ఎక్కువ కాలం గుర్తుంటుందనేది వారి నమ్మకం.

మైండ్ మ్యాప్స్
సాధారణ నోట్స్ రాసే బదులు, టాపర్లు తరచుగా మైండ్ మ్యాప్స్ తయారుచేస్తారు. ఈ విజువల్ టూల్స్ సంబంధిత అంశాలను కలుపుతాయి, ఇలా వారు కాన్సెప్ట్‌లను త్వరగా అర్థం చేసుకోవడమే కాకుండా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఒక అంశానికి సంబంధించిన పూర్తి చిత్రాన్ని ఒకేసారి చూడటానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇతరులకు బోధిస్తారు
టాపర్లు ఇతరులకు టాపిక్స్ టీచ్ చేయడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకుంటారు. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం ద్వారా టాపిక్స్ డీప్‌గా అర్థం చేసుకుంటారు. అంతేకాదు ఆ సమయంలో తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా టాపిక్‌పై మరింత పట్టు సాధిస్తారు.

రిలాక్సేషన్‌కు సమయం
టాపర్లకు బ్యాలెన్స్ ప్రాముఖ్యత తెలుసు. వారు హాబీలు, వ్యాయామం, విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయిస్తారు. విరామం తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నిరంతరం చదవకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం చాలా ముఖ్యమని వారు గ్రహిస్తారు.

ఫ్లాష్‌కార్డ్స్
టాపర్లు ఫ్లాష్‌కార్డులను తమ వెంట ఎల్లప్పుడూ తీసుకెళ్తారు. ఖాళీ సమయాల్లో, బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు వాటిని రివైజ్ చేస్తారు. నిరంతర రివిజన్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి బావుంటుంది. చిన్న చిన్న కాన్సెప్ట్‌లను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.