ఈవీ రేసులోకి మరో స్కూటర్‌.. సుజుకీ నుంచి ఇ-యాక్సెస్‌

విద్యుత్‌ స్కూటర్ల మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ రానుంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (Suzuki Motorcycle) తన పాపులర్‌ స్కూటర్‌ యాక్సెస్‌లో ఈవీ వేరియంట్‌ను తీసుకొస్తోంది. తద్వారా విద్యుత్‌ స్కూటర్‌ విభాగంలోకి సుజుకీ సైతం అడుగు పెట్టినట్లయ్యింది. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ మేరకు సుజుకీ ఇ-యాక్సెస్‌ (Suzuki e-Access) స్కూటర్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఇదే వేదికపై మరో రెండు వాహనాలనూ ఆవిష్కరించింది.


సుజుకీ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ ఇ- యాక్సెస్‌ 3.07 kWh ఎల్‌ఐపీ (Lithium Iron Phosphate) బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఇది 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. టాప్‌స్పీడ్ గంటకు 71 కిలోమీటర్లు. పోర్టబుల్‌ ఛార్జర్‌తో 6 గంటలు 42 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్‌ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. రెండు రైడింగ్‌ మోడ్‌లు, మూడు రంగుల్లో ఈ స్కూటర్‌ లభిస్తుంది. దీని ధర రూ.1.20లక్షల -రూ.1.40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇప్పటికే ఓలా, ఏథర్‌, టీవీఎస్, బజాజ్‌, హీరో సంస్థలు విద్యుత్‌ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. ఇటీవల హోండా సైతం ఈవీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇ- యాక్సెస్‌ ఎంట్రీతో విద్యుత్ ద్విచక్ర వాహన విభాగంలో గట్టి పోటీ నెలకొననుంది.

ఇ- యాక్సెస్‌తో పాటు సుజుకీ తన జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 (GIXXER SF 250) స్పోర్ట్స్ బైక్‌ను ప్రదర్శించింది. 250 సీసీ BS VI ఇంజిన్‌ కలిగిన ఈ మోటార్‌సైకిల్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌తో నడుస్తుంది. ఇక కొత్త యాక్సెస్ 125 (Access 125) స్కూటర్‌నూ ఆవిష్కరించింది. ఇందులో 125cc సింగిల్ సిలిండర్‌, ఫోర్‌- స్ట్రోక్ ఇంజిన్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, మల్టీ ఫంక్షనల్‌ డిజిటల్‌ ఇన్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు చేశారు.