ఐటీఐ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.. ఈ కోర్సులు చేస్తే మీ కెరీర్ సెటిల్ అవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్ధులే కాకుండా ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కూడా ఇప్పుడు ఐటీఐ కోర్సులు చేసేందుకు ముందుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ కోర్సులకే అధిక డిమాండు ఉంటుంది..

యేటా రాష్ట్రంలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్ధుల సంఖ్య తక్కువేమీ కాదు. కెరీర్‌లో త్వరగా స్థరపడాలని అనుకునే వారికి ఐటీఐ కోర్సులు ఉత్తమమైనవి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ కోర్సులకు కాస్త డిమాండ్ ఎక్కువే. మొత్తం సీట్లలో 64 శాతం ఈ రెండు ట్రేడులవే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్ధులే కాకుండా ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన విద్యార్ధులు కూడా ఇప్పుడు ITI కోర్సులు చేసేందుకు పోటీ పడుతున్నారు.


విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 612 సీట్లు, 25 ప్రైవేటు ఐటీసీల్లో కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా 4,108 సీట్లలో యేటా ప్రవేశాలు కల్పిస్తారు. పదోతరగతి విద్యార్హతతో ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో కలిపి మొత్తం 19 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌లో 3,040 సీట్లు ఉంటే ప్రభుత్వ విద్యలో మాత్రం 160 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ అవకాశాలతో ఇటీవల కాలంలో కోపా కోర్సుకు కూడా డిమాండు పెరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలో 96 సీట్లు ఉన్నాయి. డిమాండును బట్టి ప్రైవేటు యాజమాన్యాలు కూడా మరో 144 సీట్లు తెచ్చుకున్నాయి.

తక్కువ విద్యా అర్హతలతో త్వరగా కెరీర్ లో స్థిరపడే ఛాన్స్..

రెండేళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, మోటార్‌ వెహికల్‌ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్, ఏఓ కెమికల్, సర్వేయర్, పెయింటర్‌ కోర్సులు కూడా ఐటీఐలో అందుబాటులో ఉంటున్నాయి. ఏడాది కాలంలో పూర్తి చేసే కోర్సుల్లో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌- కంప్యూటర్‌ అసిస్టెంట్, షీట్‌ మెటల్‌ వర్కర్, కార్పెంటర్, డ్రెస్‌మేకింగ్, డీజిల్‌ మెకానిక్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేప్టీ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉన్నాయి. పదోతరగతి ఫెయిల్‌ లేదా ఎనిమిది విద్యార్హతతో వెల్డర్‌ కోర్సులు కూడా నేర్పుతున్నారు. వీటిల్లో ప్రవేశాలకు మే 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని విజయనగరం జిల్లా కన్వీనర్‌ టి.వి.గిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతంరం ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల మేరకు రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన జాబితా వివరాలను జిల్లాకు పంపుతుంది. దీని ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.