ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా? ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) ఒకటి. 2016, మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) మహిళలకు, అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించడం ప్రభుత్వ లక్ష్యం.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కట్టెల పొయ్యి వంటి సంప్రదాయ ఇంధనాలను వాడకాన్ని తగ్గించి, శుభ్రమైన, సమర్థవంతమైన ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)తో భర్తీ చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. మోడీ ప్రభుత్వం ద్వారా ఈ పథకం కింద ఇప్పటికే పది కోట్లకు పైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకే సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కూడా ఈ పథకం కింద సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉజ్వల యోజన పథకం లక్ష్యాలు:

ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లు అందించడం. 2016లో ప్రారంభమైన ఈ పథకం కింద, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 5 కోట్లకు పైగా మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతానికి, పీఎంయూవై లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ధర రూ.550 గా ఉంది. 2025 మార్చి 1 నాటికి, భారతదేశంలో 32.94 కోట్ల ఎల్పీజీ వినియోగదారులలో 10.33 కోట్ల మంది పీఎంయూవై లబ్ధిదారులు ఉన్నారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హత ప్రమాణాలు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి:

దరఖాస్తు చేసే మహిళ కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

SECC-2011 డేటాబేస్‌లో ఉన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు.

ఎస్సీ/ఎస్టీ, అతి వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), అటవీ నివాసితులు, నదీ ద్వీపాలలో నివసించే వారు, పీఎంఏవై (గ్రామీణ), అంత్యోదయ అన్న యోజన (ఆయై), టీ తోటల కార్మికులు మాజీ కార్మికులు వంటి వర్గాలకు చెందిన మహిళలు కూడా అర్హులు.

రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు.

పురుషులకు ఈ పథకానికి అర్హత లేదు.

దరఖాస్తు చేసేవారికి ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.

ఆధార్ కార్డు ఉండాలి.

బ్యాంక్ ఖాతా ఉండాలి.

మొబైల్ నంబర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పథకం కోసం మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ దరఖాస్తు:

మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన పత్రాలతో సమర్పించవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు www.pmuy.gov.in లో లాగిన్ అయి PMUY కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు మీరు ఈ దశలను అనుసరించాలి:

ముందుగా, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్‌లోకి (www.pmuy.gov.in) వెళ్లండి.

అక్కడ కనిపించే “న్యూ ఉజ్వల కనెక్షన్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

క్లిక్ చేయగానే 3 గ్యాస్ ఏజెన్సీల (ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్) పేర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో ఎంచుకోండి.

ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీలోకి వెళతారు. ఆ పేజీలో మీ పేరు, మీ సమీపంలో గ్యాస్ ఏజెన్సీ పేరు, మొబైల్ నంబర్, పిన్ కోడ్ వంటి సమాచారాన్ని నింపండి.

తరువాత అక్కడ అడిగే పత్రాల ఫోటో కాపీలను అప్‌లోడ్ చేయండి.

చివరగా, దరఖాస్తు ఫారంను సమర్పించండి.

అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే, మీ దరఖాస్తు ఫారం విజయవంతంగా పూర్తయినట్లు మీకు కనిపిస్తుంది. మీ దరఖాస్తు ఆమోదం పొందితే, సబ్సిడీ సిలిండర్ నేరుగా మీ ఇంటికి వస్తుంది.