రూ.6 లక్షలకే మారుతీ నుంచి మరో బ్లాక్‌బస్టర్! 7 మంది కలిసి వెళ్లచ్చు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దేశంలో 10 మందిలో కనీసం 6 గురు మారుతీ కార్లు కొనడానికి ఇష్టపడుతుంటారంటే ఈ కంపెనీకి ఇక్కడ ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తుంది. ఇప్పటికే డజన్ల కొద్ది మోడళ్లను విక్రయిస్తున్న మారుతీ కొత్తగా అదిరిపోయే రూపంతో ఒక కొత్త కారును తీసుకురావాలని చూస్తోంది. చిన్న కార్లు, ప్రీమియం SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిని సేల్ చేస్తున్న పెద్ద కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 7 సీటర్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ​మారుతీ సుజుకీ ‘YDB’ కోడ్‌నేమ్‌తో ఒక కొత్త కాంపాక్ట్ MPV (మల్టీ పర్పస్ వెహికల్) ను ఇండియాలో ఘనంగా లాంచ్ చేయనుంది.


ఇప్పటి వరకు మారుతీ MPV విభాగంలో ఎర్టిగా ఆధిపత్యం చెలాయిస్తుండగా, ఇప్పుడు ఈ కొత్త మోడల్ రాకతో ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతీ తిరుగులేని మార్కెట్ వాటా సాధించే అవకాశం ఉంది. పైగా కొత్త కారును ఎర్టిగా కంటే చాలా తక్కువ ధరకు వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా అందుబాటులోనే తీసుకొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీన్ని జపాన్‌లో విక్రయించే సుజుకి “స్పాసియా” ఆధారంగా రూపొందించారు.

జపాన్‌లో ఈ ప్రసిద్ధ కారు బాగా డిమాండ్ ఉన్న మోడల్. చాలా మంది వినియోగదారులు దీన్ని కొనుగోలు చేస్తున్నారు. సుజుకీ స్పాసియా పేరుతో అక్కడి వారికి అందుబాటులో ఉంది. విజయవంతంగా జపాన్‌లో సేల్స్ నమోదు చేస్తుండటంతో దీన్ని భారత్‌లోకి కూడా లాంచ్ చేసి ఇక్కడ కూడా ఈ కారు అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తుంది. పైగా ఇండియాలో ఎంపీవీ కార్లకు డిమాండ్ కూడా సానుకూలంగా ఉండటం కలిసి వచ్చే అంశం. జపాన్‌లో అమ్ముడవుతున్న కారు అక్కడి కస్టమర్లకు అనువుగా ఉండగా, భారత్‌లోకి లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి విడువల చేయబోతున్నారు. ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కుటుంబ వినియోగదారులు ఇండియాలో ఎక్కువగా ఉంటారు. అందుకే జపాన్‌ మోడల్‌లో కంటే ఇక్కడ విక్రయానికి రాబోతున్న మోడల్ మరింత కొత్త ఫీచర్స్‌తో అలరించడానికి వస్తుంది. జపనీస్ వెర్షన్ సుజుకి స్పాసియా రెండు వరుసల సీట్లను కలిగి ఉంటుంది.

దీని పొడవు 3,395 మిమీ. అక్కడ ఇది ఎంపీవీగా పరిగణించినప్పటికి 7-సీటర్ మోడల్ కాదు. కానీ ఇండియాకు వస్తున్న మోడల్ కొంచెం పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ కారును సబ్-4-మీటర్ విభాగంలో విడుదల చేస్తుంది. మూడు వరుసలతో 7-సీట్ల మోడల్‌గా మాదిరిగా ఉండే అవకాశం ఉంది. ఇండో-జపనీస్ బ్రాండ్ అయిన మారుతీ సుజుకీ ఈ కొత్త కారుతో ప్రధానంగా రెనాల్ట్ ట్రైబర్‌తో పోటీ పడుతుంది.

ఇండియాలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్య ఉంటుందని అంచనా. జపాన్‌లో, సుజుకీ స్పాసియా 660cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అయితే భారతదేశంలో లాంచ్ అయ్యే కారులో ఇది ఉండకపోవచ్చని తెలుస్తుంది. భారతీయ వేరియంట్‌లో కొత్త 1.2 లీటర్ Z సిరీస్ త్రీ-సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించబడే అవకాశం ఉంది, ఇది రాబోయే స్విఫ్ట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ గా ఉంటుంది. మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఇది 2026లో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త డిజైన్, పరిమాణంలో మార్పులు, కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతున్న ఈ మోడల్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.