టిఫెన్స్లోకి పల్లీ చట్నీ తర్వాత చాలా మంది ఇష్టంగా తినేది కొబ్బరి పచ్చడి. నచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ను కమ్మని కొబ్బరి చట్నీలో అద్దుకుని తింటే ఆ కిక్ వేరే లెవల్. అయితే చాలా మందికి ఈ పచ్చడిని చేయడం, అందులోనూ హోటల్ స్టైల్లో చేయడం అస్సలు రాదు. ఏదో తమకు వచ్చిన పద్ధతిలో చేస్తుంటారు. అయితే కొబ్బరి పచ్చడిని ఓసారి ఇలా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా హోటల్ టేస్ట్ పక్కాగా వస్తుంది. అంతేకాదు దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎటువంటి కష్టం పడకుండా అతి తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కమ్మని, రుచికరమైన కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- పచ్చి కొబ్బరి ముక్కలు – 1 కప్పు
- పచ్చిమిర్చి – కారానికి సరిపడా
- అల్లం ముక్క – చిన్నది
- చింతపండు – కొద్దిగా
- పుట్నాల పప్పు – పావు కప్పు
- నూనె – 2 టీస్పూన్లు
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- ఉప్పు – సరిపడా
తాలింపు కోసం:
- నూనె – 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు – అర టీస్పూన్
- జీలకర్ర – అర టీస్పూన్
- శనగపప్పు – అర టీస్పూన్
- మినప్పప్పు – అర టీస్పూన్
- ఎండుమిర్చి – 2
- కరివేపాకు – 2 రెమ్మలు
-
తయారీ విధానం:
- కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- మిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి వేయించిన పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, చింతపండు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి చట్నీని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పచ్చిమిర్చి వేయించిన పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత తాలింపు గింజలు(ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు) వేసి వేయించాలి.
- తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఈ తాలింపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమంలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
-
చిట్కాలు:
- ఈ పచ్చడి కోసం తాజాగా ఉన్న ముదురు కొబ్బరి అయితే రుచి బాగుంటుంది.
- తాలింపు రంగు మారి మాడిందంటే పచ్చడి రుచి కూడా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ వేయించాలి.
- పచ్చడి బరకగా ఉంటేనే తింటున్నప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది. కాబట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- పచ్చడి కాస్త గట్టిగానే ఉండాలి. ఒకవేళ మీకు కాస్త లూజ్‌గా కావాలనిపిస్తే గోరువెచ్చటి నీటిని పచ్చడిలో కలిపితే సరిపోతుంది.