ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పింఛను మొత్తాన్ని బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా పంపిణీ చేశామన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 65.18 లక్షల మందికి పింఛన్లు అందించడానికి రూ.4,408 కోట్లు రెండు రోజుల కిందటే విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జీతాల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమవుతాయని వెల్లడించారు.