గిగ్‌ వర్కర్లకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్‌ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్‌ సెక్టార్‌లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. 


 

మే 1న తెలంగాణ గిగ్‌ వర్కర్ల చట్టం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్‌ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్‌ వర్కర్‌ అసోషియేషన్లు రేవంత్‌ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాయి.

ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్‌ వర్కర్లను రిజిస్టర్‌ చేయడం, వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్‌ఫారమ్‌ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు.

గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్‌ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ,  కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

దేశంలో గిగ్‌ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్‌ గిగ్‌ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్‌ ఫ్లాట్‌ఫారమ్‌ బేస్డ్‌ గిగ్‌ వర్కర్స్‌ (Registration and Welfare) యాక్ట్‌ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది.  అయితే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.