Life History of Netaji Subhash Chandra Bose(23 January 1897-18 August 1945)-నేతాజీ సుభాష్ చంద్రబోస్ – బాల్యం – విద్య-భారత జాతీయ కాంగ్రెస్‌లో -స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక-దేశం వీడి అజ్ఞాతం లోకి జర్మనీలో -భారత జాతీయ సైన్యం-మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను –అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం-అపరిచిత సన్యాసి -నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 – ఎ లవ్ స్టోరీ- ఎమిలీ షెంకెల్ తో ప్రేమ-మనసు చెదిరిన బోస్ -డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలో ఎమిలీ, బోస్‌ల వివాహం -నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు-చివరి వరకు రహస్యంగానే.. సుభాష్ చంద్రబోస్ 1942 డిసెంబర్‌లో తన కూతురిని చూసేందుకు వియన్నా వెళ్ళడం -అదే చివరి సారి చూడటం -పూర్తీ వివరాలు కోసం
ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఓ బులెట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి గుర్తు చేసుకుందాం. ఫిబ్రవరి 4, 1944వ సంవత్సరం ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్‌ను రక్షించేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరిన రోజు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనికరీతిన పోరాడి స్వతంత్ర్యం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
స్వాంతంత్ర్య కోసం చేసిన పోరాట చివరిఘట్టంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో అన్యదేశ మట్టిలో కాలూని భారత్ స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది.
అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్ర్యం లభించదని ఆయుధాలను చేతపట్టే స్వాతంత్ర్యాన్ని సాధించగలమనే నినాదాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లేవనెత్తారు. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాడటం తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది.
అహింసా మార్గంలో మాత్రమే కాకుండా వీర మార్గంలో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నేతాజీ తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరారు. బ్రిటిష్ ఏకాధిపత్యాన్ని అహింసా మార్గంలో అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండేళ్లు ఎంపికయ్యారు.
అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్ట్‌లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆప్ఘనిస్థాన్, రష్యా, మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు. రెండో ప్రపంచయుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్- ఇటలీల సహాయంతో హిట్లర్‌తో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి.
ఆయుధ యుద్ధాన్ని ప్రారంభించ దలచిన బోస్ 1943వ సంవత్సరం జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు. 1944వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ బర్మా రాజధాని రాంకూన్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల ధాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది.
ఈ సైన్యం ఇమ్మాల్ నగరానికి చేరుకుని ఇమ్మాల్ సైనిక స్థావరాన్ని ముట్టడించింది. ఈ పోరులో ఇరువర్గాలకు మధ్య తీవ్రపోరు జరిగింది. జూన్ 27వ తేదీ ఇమ్మాల్ ముట్టడిని విరమించిన జాతీయ సైన్యం భారత జాతీయ సైన్యంతో బరిలోకి దిగి పరాజయాన్ని చవిచూసింది. బ్రిటిష్ సైనిక దళాల చేతుల్లో కాకుండా భారీ వర్షాలతో కూడిన వరదల వల్లనే పరాజయం పాలైందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. ఇమ్మాల్‌పై దాడులు తప్పవని నేతాజీ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన విఫలమైంది. సింగపూర్, రంగూన్ సైనిక దళాలకు బ్రిటిష్ దళాలు దగ్గరయ్యాయి.
1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేస్తూ నేతాజీ మాట్లాడిన అంశాలివే…
ఈ తాత్కాలిక ఓటమితో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మనోధైర్యంతో ముందుకు నడవండి. భారతదేశాన్ని బానిసత్వం, ఏకాధిపత్యంనుంచి త్వరలో విడుదల పొందుతుందని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత నేతాజీకి దేశాభిమానాన్ని అలవరిచిన శ్రీ అరవిందర్ పుట్టినరోజైన ఆగస్టు 15వ తేదీన భారత్‌కు స్వతంత్ర్యం లభించింది.
నేతాజీ పుట్టుపూర్వోత్తరాలు…
1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒరిస్సా, ఖాట్గాలో నేతాజీ జన్మించారు. తండ్రి జానకీ నాథ్. తల్లి ప్రభావతీ బోస్, చిన్న నాటి నుంచే విద్యారంగంలో రాణించిన నేతాజీ శ్రీ రామకష్ణ, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. సన్యాసం తీసుకోడానికి తీర్మానించారు.
“మానవసేవే మాధవసేవ” అనే నినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా రాసే వ్యాసాలు స్వాతంత్రసమరంలో పాల్గొనే వీరులకు ఉత్సాహాన్ని ఏర్పరచాయి.
1919వ సంవత్సరం తత్త్వ పాఠ్యాంశంలో నేతాజీ డిగ్రీని సంపాదించారు. తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరిన సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో జలియన్ వాలా బాగ్ సంఘటన చోటుచేసుకుంది. 1921వ సంవత్సరం ఐసీఎల్‌ను ముగించిన బోస్ ఐసీఎల్ అధికారిగా బాధ్యతలు వహించక స్వాతంత్రసమరంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వెల్స్ క్యూన్ భారత్ రాకకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. అనంతరం 20 సంవత్సరాల్లో 11 సార్లు బ్రిటిష్ ప్రభుత్వంచే అరెస్టయ్యారు. 1928వ సంవత్సరం డిసెంబర్ నెలలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పూర్తి స్వాతంత్ర్యం లభించేంతవరకు ఒప్పుకునేది లేదని తీర్మానించింది.
అయితే గాంధీజీ అహింసా వాదంతో ఈ తీర్మానం సద్దుమణిగిందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. 1929వ సంవత్సరంలో లాహూర్‌లో జరిగిన బహిరంగ సభ నేతాజీని కాంగ్రెస్ కార్మికసంఘ అధ్యక్షుడిగా నియమించింది. 1938వ సంవత్సరంలో బోస్ 41 ఏట అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
1939వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతు ఎన్నికల బరిలోకి దిగిన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22వ తేదీ నేతాజీ పయనించిన యుద్ధవిమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియో ప్రకటించింది.
అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.
అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్ కు లేఖను పంపడం జరిగింది.
|
RENKOJI REMPLE |
ఈ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమీషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమీషన్ నివేదికను తిరస్కరించింది
అపరిచిత సన్యాసి
1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు
Mannam Srinivas:భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది.[7] ఏదైనప్పటికి భగవాన్ జీ జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 – ఎ లవ్ స్టోరీ! SOURCE -bbc telugu
అది 1934. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొంటూ జైలు పాలైన సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం క్రమంగా దిగజారడంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స నిమిత్తం ఆయనను యూరప్‌లోని ఆస్ట్రియాకు పంపింది.
అయితే వియన్నాలో చికిత్స పొందుతూనే యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించారు.
ఆ సమయంలో ఒక యూరోపియన్ పబ్లిషర్ ‘ద ఇండియన్ స్ట్రగుల్’ అన్న పుస్తకం రాయాలని ఆయనను కోరారు. దాంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది.
బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్ ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. బోస్ ఆ ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలిగా నియమించుకున్నారు. ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించారు.
ఆ సమయంలో బోస్‌కు 34 ఏళ్లు. ఎమిలీని కలవడానికి ముందు ఆయన ఆలోచనలన్నీ దేశ స్వాతంత్ర్యం మీదే నిమగ్నమై ఉన్నాయి. అయితే ఎమిలీ తన జీవితంలో ఒక తుపాను తెస్తుందని ఆయన ఊహించలేకపోయారు.
సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవడైన సుగత్ బోస్, సుభాష్ చంద్రబోస్‌పై ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన ఎమిలీని కలవడంతో బోస్ జీవితమే మారిపోయిందని రాశారు.
‘మొదట ప్రేమ విషయాన్ని బోసే ప్రతిపాదించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించడం ప్రారంభించింది. 1934-36 మధ్యకాలంలో ఆస్ట్రియా, చెకొస్లొవేకియాలలో ఉన్న సమయం మా జీవితంలో అత్యంత మధురమైనది’ అని ఎమిలీ సుగత్ బోస్‌కు చెప్పుకొచ్చారు.
ఎమిలీ జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రికి ఆమె ఓ భారతీయుని వద్ద పని చేయడం ఇష్టం లేదు. అయితే సుభాష్ చంద్రబోస్‌ను కలిసిన తర్వాత ఆయన వారి ప్రేమను కాదనలేకపోయారు.
ప్రముఖ విద్యావేత్త రుద్రాంశు ముఖర్జీ- బోస్, జవహర్ లాల్ నెహ్రూ జీవితాలను పోలుస్తూ ‘ నెహ్రూ అండ్ బోస్, పేరలల్ లైవ్స్’ అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన బోస్, నెహ్రూలపై వారి భార్యల ప్రభావాం గురించి రాసుకొచ్చారు.
ఆ పుస్తకంలో ముఖర్జీ, ”సుభాష్, ఎమిలీలు మొదటి నుంచీ తమ బంధం ప్రత్యేకమైనదని, క్లిష్టమైనదని గుర్తించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను బట్టి ఈ విషయం మనకు తెలుస్తుంది. ఎమిలీ మిస్టర్ బోస్ అని సంబోధిస్తే, బోస్ ఆమెను మిస్ షెంకెల్ లేదా పెర్ల్ షెంకెల్ అని సంబోధించేవారు.” అని రాశారు.
Mannam Srinivas:తన ఉనికి బయటపడకుండా ఉండడానికి, సైనిక పోరాటంలో యూరోపియన్ దేశాల సహాయాన్ని తీసుకోవడానికి బోస్ నిరంతరం ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఎమిలీ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉండేదో ఆయన ఆమెకు రాసిన ప్రేమలేఖను బట్టి తెలుస్తుంది.
1936 మార్చి 5న రాసిన ఈ లేఖలో, ”మై డార్లింగ్, సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా ఇదే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రాయకుండా, చెప్పకుండా నన్ను నేను నిలువరించుకోలేకపోతున్నాను. మై డార్లింగ్, నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అంటారు.
”భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జీవితాంతం జైలులో గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు. బహుశా నేను ఉత్తరాలు కూడా రాయలేకపోవచ్చు. కానీ నన్ను నమ్ము, నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. మనం ఈ జీవితంలో కలిసి ఉండలేకపోతే, వచ్చే జన్మలోనైనా కలిసి ఉందాం.” అని ఎమిలీకి రాశారు.
మనసు చెదిరిన బోస్
బోస్ స్నేహితులు, రాజకీయ సహచరులు ఏసీఎన్ నంబియార్, ”బోస్ ఆలోచనలు ఎప్పుడూ దేశ స్వాతంత్ర్యం మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన మనస్సు ఎక్కడైనా చెదిరింది అంటే అది ఎమిలీతో ప్రేమలో పడినప్పుడే” అని సుగత్ బోస్‌కు తెలిపారు.
ఆ సమయంలో బోస్ మానసిక స్థితి ఎలా ఉందో 1937 ఏప్రిల్ లేదా మేలో ఎమిలీకి రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది.
”గత కొన్ని రోజుల నుంచి నీకు ఉత్తరం రాయాలనుకుంటున్నా. కానీ నీకు తెలుసు, నీ గురించి నా భావాలను మాటల్లో పెట్టడం ఎంత కష్టమో. నేను నీ పట్ల గతంలో ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నానని మాత్రమే చెప్పదల్చుకున్నా.”
”నీ గురించి తలచుకోకుండా ఒక్క దినం కూడా గడవదు. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నువ్వు కాకుండా నేను ఇతరుల గురించి ఆలోచించను కూడా ఆలోచించలేను. ఈ రోజుల్లో నేనెంత ఒంటరిగా, దిగులుగా ఉన్నానో నీకు చెప్పలేను. కేవలం ఒకే ఒక్క విషయం నన్ను సంతోషంగా ఉంచుతోంది. అయితే అది సాధ్యమో లేదో నాకు తెలీదు. రాత్రీ పగలూ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నాకు సరైన దారి చూపించాలని ప్రార్థిస్తున్నాను.” అని రాశారు.
శరత్ చంద్రబోస్ కుమారుడు శిశిర్ కుమార్ బోస్ భార్య కృష్ణ బోస్ ‘ఎ ట్రూ లవ్ స్టోరీ – ఎమిలీ అండ్ సుభాష్’ పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె సుభాష్ చంద్రబోస్, ఎమిలీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఎమిలీ, బోస్‌ల వివాహం డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలోని బాడ్‌గస్టైన్‌లో జరిగింది.
అయితే తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి రోజు గురించి తప్ప ఏ వివరాలూ ఎమిలీ వెల్లడించలేదని కృష్ణ బోస్ తెలిపారు.
అయితే వారి కూతురు అనితా బోస్ మాత్రం తన తల్లి ఎమిలీ ఇతర భారతీయ పెళ్లికూతురి తరహాలోనే తలపై సింధూరం ధరించారని వివరించారు.
వాళ్ల ప్రేమకు గుర్తుగా నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు పుట్టింది. వారు ఆమెకు ఇటలీ విప్లవ నేత గారిబాల్డీ భార్య, బ్రెజిల్ మూలాలు కలిగిన అనిత గారిబాల్డీ పేరిట అనిత అని పెట్టారు
చివరి వరకు రహస్యంగానే..
వివాహాన్ని రహస్యంగా ఉంచడం వెనుక అది తన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని బోస్ భావించి ఉండవచ్చు. అంతే కాకుండా ఒక విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
శరత్ చంద్రబోస్ కార్యదర్శి, ప్రముఖ రచయిత నిరాద్ సి.చౌదరి 1989లో రాసిన ‘దై హ్యాండ్, గ్రేట్ అనార్క్: ఇండియా 1921-1952’ అన్న పుస్తకంలో ‘’బోస్ వివాహం గురించి తెలిసినపుడు నాకు షాక్ తగిలింది. మొదటి యుద్ధం తర్వాత ఆయన తన సెక్రటరీ అయిన ఒక జర్మన్ మహిళను పెళ్లాడినట్లు నాకు తెలిసింది” అని పేర్కొన్నారు.
సుభాష్ చంద్రబోస్ 1942 డిసెంబర్‌లో తన కూతురిని చూసేందుకు వియన్నా వెళ్లారు. ఆ తర్వాత ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్‌కు బెంగాలీలో రాసిన లేఖలో తన భార్య, కూతురి గురించి పేర్కొన్నారు. అక్కడి నుంచి ఒక మిషన్ మీద వెళ్లిన ఆయన తర్వాత మరెన్నడూ ఎమిలీ, అనితలను కలుసుకోలేదు.
కానీ ఎమిలీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలతోనే జీవించి 1996లో కన్ను మూశారు. ఓ చిన్న పోస్టాఫీసులో పని చేస్తూ ఆమె సుభాష్ చంద్రబోస్ గుర్తుగా మిగిలిన అనితా బోస్‌ను పెంచి పెద్ద చేసి, జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దారు.
|
Anita Bose Pfaff with a photo of her father, Netaji Subhash Chandra Bose, in her residence in Augsburg, Germany |
ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి సహాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అంతే కాదు, తమ వైవాహిక జీవితం గురించి బోస్ ఎంత రహస్యంగా ఉంచారో, దానిని ఆమె చివరి వరకు కాపాడారు