Glenn Maxwell: ‘మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా’.. ఐపీఎల్‌ నుంచి మ్యాక్స్‌వెల్‌ బ్రేక్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో బెంగళూరు కీలక ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే గత రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు దూరమైన అతడు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. మానసిక సమస్యల కారణంగా ఈ లీగ్‌ టోర్నీ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌ చేతిలో జట్టు ఓటమి అనంతరం అతడు మాట్లాడుతూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

‘‘వ్యక్తిగతంగా ఇది నాకు సులువైన నిర్ణయమే. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు నేను కెప్టెన్‌ ఫాఫ్‌ (డుప్లెసిస్‌), కోచ్‌ వద్దకు వెళ్లి.. నా బదులు మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా. కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయా. పవర్‌ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోంది. బ్యాట్‌తో నేను ఆశించిన మేర రాణించలేకపోతున్నా. విజయాలను అందించలేకపోయా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. అప్పుడే నేను ఫిట్‌గా తిరిగొస్తా. అందుకే, నా స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని భావించా. వారు తప్పకుండా రాణిస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ టోర్నమెంట్‌లో నా అవసరం ఉంటే.. తప్పకుండా బలంగా తిరిగొస్తా’’ అని మ్యాక్సీ చెప్పాడు.

తాజా సీజన్‌ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ఈ ఆల్‌రౌండర్‌ ప్రకటించాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో మెరిపించలేక మ్యాక్సీ విమర్శలపాలయ్యాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌ నుంచి స్వయంగా వైదొలిగాడు. అతడి స్థానంలో విల్‌ జాక్స్‌ను తీసుకొన్నారు. అయినప్పటికీ బెంగళూరు ప్రదర్శనలో పెద్దగా మార్పులేదు. హైదరాబాద్‌పై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *