AP: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుని చుక్కలు చూసిన చిన్నారి.. చివరకు

పిల్లలను కదలకుండా ఒక్క చోట ఉంచడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. మనం చెప్తే వినరు.. ప్రమాదాల గురించి వారికి అర్థం కాదు. అందుకే నిత్యం వారిపై ఓ కన్ను వేసి ఉంచాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న.. ఏదో ఓ ప్రమాదంలో ఇరుక్కుంటారు. పైగా అసలే ఇది వేసవి కాలం.. హాలీడే సీజన్. ఇంకేముంది పిల్లలు ఆడిందే ఆట.. పాడిందే పాట. అల్లరితో పాటు కొన్ని సమయాల్లో అనుకోని ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. తాజాగా ఓ చిన్నారి కూడా ఇలానే ఆడుకుంటూ పోయి.. ప్రమాదంలో ఇరుక్కుని చుక్కలు చూసింది. ఆ వివరాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్న ఓ చిన్నారి.. రెండు ఇళ్ల మధ్యలో ఉన్న ఓ సందులో ఇరుక్కుంది. అర అడుగు వెడల్పు కూడా లేని సందులో దూరి.. బయటకు రాలేక పాపం గంటల పాటు నరకం అనుభవించింది. చిట్ట చివరకు సహాయక సిబ్బంది బాలికను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

ఆవుల తిప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతిక ఆడుకుంటూ వెళ్లి.. రెండు ఇళ్ల మధ్య వదిలేసిన సందులో ఇరుక్కుపోయింది. కనీసం అరడుగు వెడల్పు కూడా లేని సందు నుంచి బయటకు రావడానికి అన్ని విధాల ప్రయత్నించింది. కానీ వీలుకాలేదు. తల్లిదండ్రులు, గ్రామస్తులు బాలికను బయటకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ అవేవి ఫలించలేదు.

చివరకు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి.. చివరకు ఓ వైపు ఇంటి గోడను పగలగొట్టి.. చిన్నారి అవంతికను రక్షించారు పోలీసులు. బాలిక క్షేమంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బార్దర్ అభినందనలు తెలిపారు. ఈ వార్త తెలిసిన వాళ్లు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *