పెనంకు దోశ అతుక్కోకుండా ఉండటానికి చిట్కాలు

దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోశలు చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా ఇడ్లీ కంటే దోశ అంటేనే చాలామందికి ఇష్టం.


ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. కానీ ఉదయం తొందరగా దోసెలు వేస్తుంటే, దోశ పెనంకు అతుక్కుపోయి మన ఓపికను పరీక్షిస్తుంది. ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా జరిగితే చిరాకు వస్తుంది. దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. దోసె పెనంకు అతుక్కోకుండా, బాగా రావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త దోశ పెనం కోసం చిట్కాలు:

ముందుగా దోశ పెనం కొన్న వెంటనే దానిపై ఉన్న మురికిని తీయడానికి కొబ్బరి పీచు లేదా కాటన్ గుడ్డ ఏదైనా ఉపయోగించి శుభ్రం చేయండి. కానీ స్క్రబ్బర్ మాత్రం వాడొద్దు. దీని కోసం మీరు సోప్ లేదా లిక్విడ్ వంటివి ఉపయోగించవచ్చు. తర్వాత దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆముదం వేయాలి. ఇప్పుడు పెనం మీద తమలపాకులు వేయండి. ఆ నూనెలో తమలపాకులు బాగా వేడయ్యాక మరొక తమలపాకు వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తో తమలపాకును దోసె పెనం మొత్తం బాగా రుద్దండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత ఆ నూనెను తుడిచి ఇప్పుడు మీరు దోశ వేయడం ప్రారంభించవచ్చు. అలా దోసె వేసేటప్పుడు దోసె పెనంకు అతుక్కోకుండా, విరిగిపోకుండా సూపర్ గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర తమలపాకులు లేకపోతే అరటి ఆకును ఉపయోగించవచ్చు.

పాత దోశ పెనం కోసం చిట్కాలు:

పాత దోశ పెనం అంటే తుప్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందుగా దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసి దానిపై కొద్దిగా నీళ్లు పోసి అందులో ఉప్పు, నిమ్మకాయ లేదా వెనిగర్ ఏదైనా వేసి బాగా రుద్దాలి. తర్వాత దోసె పెనాన్ని కడిగి ఒక ఉల్లిపాయని సగానికి కోసి కొద్దిగా నూనె రాసి దోసె పెనం మొత్తం బాగా రుద్దాలి. ఇప్పుడు దానిపై దోశ వేయండి. దోశ అతుక్కోకుండా బాగా వస్తుంది. ఉల్లిపాయ లేకపోతే వంకాయ కూడా ఉపయోగించవచ్చు.

మరొక మార్గం..

ఒక చిన్న కాటన్ గుడ్డలో కొద్దిగా చింతపండు వేసుకోండి. తర్వాత ఆ గుడ్డను నూనెలో ముంచి దోసె పెనం మొత్తం బాగా రుద్దండి. ముఖ్యంగా అన్ని చోట్లా బాగా తగలాలి. ఇప్పుడు దోసె పెనాన్ని కడిగి పెనం ఆరిన తర్వాత అందులో చింతపండు కలిపిన నూనెను మళ్లీ రుద్దాలి. తర్వాత ఉల్లిపాయతో దోసె పెనం మొత్తం రుద్దండి. ఉల్లిపాయ రసం దోశ పెనంపై ఒక పలుచని పొరను ఏర్పరుస్తుంది, ఇది దోశ పెనంకు అతుక్కోకుండా బాగా రావడానికి సహాయపడుతుంది. పైన చెప్పిన చిట్కాల ప్రకారం దోసె పెనంపై దోశ వేస్తే ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంతోషంగా దోశలు వేసి తినవచ్చు.

గమనిక: మీరు ఎప్పుడు దోశ వేసినా మంటను ఎక్కువగా పెట్టకుండా మీడియం మంట మీద దోశలు వేయండి.