వెయ్యి గ్రామాలకు నీళ్లు అందించిన ఈయనను చంపాలని చూశారు..ఎందుకో తెలుసా?

కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కరువు విలయతాండవం చేసేది. భూగర్భ నీటి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉండేవి.


తాగునీటికి కూడా అక్కడి జనం అల్లాడేవారు. మంచి నీళ్లు తాగాలంటే మహిళలు 8 నుంచి 9 గంటలు పట్టేంత దూరం నడిస్తేనే గానీ తాగడానికి మంచి నీళ్లు దొరకవు. ఈ పరిస్థితుల్లో చాలా కుటుంబాలు బలవంతంగా వీరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ సమయంలో ఒక్కడు వచ్చాడు. అతనే రాజేంద్ర సింగ్. ఆళ్వార్ గ్రామానికి ఆయుర్వేదిక్ డాక్టర్ గా వచ్చిన రాజేంద్ర సింగ్ అక్కడి నీళ్లు లేక జనం అల్లాడుతుంటే చూసి చలించిపోయారు. ఈ గ్రామంలో వారికి అనారోగ్య సమస్యలకు కారణం నీళ్ల సమస్య అని తెలుసుకున్న రాజేంద్ర సింగ్ దాన్ని పరిష్కరించాలని అనుకున్నారు.

వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి గ్రామస్తుల సహాయం తీసుకున్నారు. అయితే మొదట్లో గ్రామస్తులు ఈయనను నమ్మలేదు. వింత వ్యక్తిలా చూశారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయనను నమ్మడం ప్రారంభించారు. ఇలా ఒక్క గ్రామం నుంచి మొదలై 1000 గ్రామాల ప్రజలను సమీకరించి 11 వేల నీటి వనరులను సృష్టించారు. దీంతో వెయ్యి గ్రామాల్లోనూ వాటర్ లెవల్ పెరిగింది. ఎండిన నదుల్లో నీరు వచ్చింది. వలస వెళ్లే పరిస్థితి పోయి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి వాళ్ళు వ్యవసాయాన్ని స్థిరమైన వృత్తిగా ఎంచుకున్నారు. సమృద్ధిగా నీరు, మంచి ఆహారం కారణంగా అక్కడి ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. చాలా సంతోషంగా జీవించేవారు. అయితే ఇదంతా సాఫీగా జరిగిపోతే ఈరోజు ఈయన గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం. మంచి చేస్తుంటే అడ్డుకునేందుకు విలన్ బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. రాజేంద్ర సింగ్ లైఫ్ లో కూడా మైనింగ్ మాఫియా రూపంలో విలన్స్ ఎదురుపడ్డారు.

అదేంటి ఆయన దారి వేరు, వీళ్ళ దారి వేరు కదా.. శత్రుత్వం ఎందుకు అని అనుకోకండి. ఎందుకంటే పంట పండని పొలాల్లోనే వీళ్ళు మైనింగ్ చేసేవారు. నీళ్లు రావు, పంట పండదు.. ఆ భూమి ఎందుకూ పనికిరాదని చెప్పి గ్రామస్తులను మాయ చేసి వాళ్ళ భూములను మైనింగ్ కోసం ఉపయోగించుకునేవారు. ఇంకొంతమందిని అయితే మైనింగ్ పనిలో పెట్టుకునేవారు. ఇప్పుడు రాజేంద్ర సింగ్ హీరోలా వచ్చి ఎందుకూ పనికిరాని బీడు భూములను పంట పొలాలుగా మార్చేస్తానంటే మైనింగ్ మాఫియా వాళ్ళు ఎలా బతకాలి? భూమిని తినకుండా జీవించడం ఎలా? మైనింగ్ పనిలోకి జనాలు రాకపోతే ఎలా? అని ఆలోచనలో పడ్డారు. ఒక్కడి వల్ల మైనింగ్ మాఫియా షేక్ అయ్యింది.

ఇలాంటోడు ఉంటే తమ ఉనికికే ప్రమాదం అని రాజేంద్ర సింగ్ ని చంపాలని చూశారు. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. దీని వల్ల ఆయన 20 రోజులు కోమాలోకి వెళ్లారు. ఈయన కోమాలోకి వెళ్ళిపోయినందుకు గ్రామస్తులు ధైర్యం కోల్పోలేదు. మైనింగ్ మాఫియాతో పోరాడారు. అటవీ ప్రాంతంలో మైనింగ్ ఆపాలని మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ 470 మైనింగ్ సైట్లు మూసివేతకు కారణమైంది. ఇది మైనింగ్ మాఫియాకి అతిపెద్ద దెబ్బ. రాజేంద్ర సింగ్ చేసిన సేవలను, కృషిని పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ప్రతిష్టాత్మకమైన ‘స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్’ ఆయనను వరించింది. నీటి రక్షణ, సంరక్షణలో ఇదే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈయనను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి వెయ్యి గ్రామాల ప్రజల జీవన విధానాన్ని మార్చిన వాటర్ మ్యాన్ గురించి మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.