AP Elections 2024: బిగ్ ట్విస్ట్.. నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకంటే మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మార్పుల్లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
మార్పులు ఇవే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టికెట్ ఖరారు చేసింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో.. రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా రామరాజు స్థానంలో రఘురామకు ఉండి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ రఘురామకు బీఫామ్ అందజేయనున్నారు. అలాగే పాడేరు టికెట్‌ను కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించారు. అక్కడ టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించడంలేదు. ఆయనను మార్చాలని అధిష్టానంపై స్థానిక నాయకత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆ టికెట్‌ను మాజీ ఐఎఎస్ కృష్ణప్రసాద్‌కు కేటాయించడంతో ఎంఎస్ రాజును మడకశిర నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మిసాయిప్రియకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ పోటీ చేస్తుండటంతో.. లక్ష్మిసాయిప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. మార్పులు, చేర్పులపై ఇవాళ అధికారిక ప్రకటన వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. బీఫామ్‌లు సైతం కొత్త అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందిచనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *