YSRCP: వైకాపాలో ఇన్‌ఛార్జుల మార్పు.. మరో జాబితా విడుదల

అమరావతి: వైకాపాలో ఇన్‌ఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్‌ యాదవ్‌, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా. ఇక ఒకటో అరో ఉంటాయంతే’ అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. అయిదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు. మొత్తంగా రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులతో 8వ జాబితాను బుధవారం విడుదల చేశారు.

అంబటి కుటుంబానికి రెండా.. ఒకటేనా?
పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైకాపాను వీడి మళ్లీవచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పైగా సత్తెనపల్లిలో కొందరు మంత్రి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది.

Related News

కందుకూరులో 12 రోజులకే మళ్లీ మార్పు
కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్‌ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైకాపాలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే.. బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు.

కుమారుడిని తప్పించి అల్లుడికి..
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల 2న నియమించారు. ఆయన దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను బుధవారం నియమించారు.

జీడీ నెల్లూరులో మూడోసారి మార్పు
గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు. జనవరి 18న నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడటంతో అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకుంది. నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈ నెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది.

ఒంగోలులో ముందుగానే నిర్ణయించినా..
ఒంగోలు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైకాపా పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ.. సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు.

ఇప్పటికి ఆరుగురు ఎంపీలు ఔట్‌
అధికార వైకాపాలో పార్లమెంటు సభ్యుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సరిగ్గా వారం కిందటే వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోక్‌సభ సభ్యులు డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణరాజు (నరసాపురం) రాజీనామా చేశారు. అంటే అయిదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు వైకాపాను వీడారు. మరోవైపు గొడ్డేటి మాధవి (అరకు), గోరంట్ల మాధవ్‌ (హిందూపురం)లకు ఈసారి వైకాపా పెద్దలు ఎక్కడా టికెట్‌ కేటాయించలేదు. మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఇటీవల నియమించారు. కానీ, వెంటనే అక్కడ మరో కొత్త సమన్వయకర్తను తెరపైకి తీసుకువచ్చి మాధవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరోచోట టికెట్‌ ఇస్తారా లేదా అనే విషయంపై ఆమెకు స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయబోనని ఆ పార్టీ అధిష్ఠానానికి తేల్చి చెప్పేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *