Vizag: సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?

Vizag: విశాఖపట్నం (Visakhapatnam) లో బీచ్‌ ఎంత ఫేమస్సో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇక్కడ సంపత్‌ వినాయక ఆలయం (Sampat Vinayaka Temple) కూడా అంత ఫేమస్‌. నగర నడిబొడ్డున వెలిసిన సంపత్ వినాయకుడిని దర్శించుకుంటే తాము అనుకున్న పనులు ఇట్టే జరిగిపోతాయని ప్రజలు విశ్వసిస్తారు. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని భక్తుల ప్రగాఢనమ్మకం. సకల విఘ్నాలను హరించి కోరినకోర్కిలు తీర్చే వేల్పుగా ఈ వినాయకుడు (Lord Vinayaka) ప్రసిద్ధి చెందాడు. ప్రతి రోజూ దాదాపు వేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్‌ వినాయక దేవాలయం.. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా ఈ ఆలయం విలసిల్లుతోంది.

ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) కి.. ఆర్టీసీ కాంప్లెక్స్ (RTC Complex) కు మధ్యలో 1962లో ఆశీలుమెట్ట ప్రాంతంలో టి.ఎస్‌.రాజేశ్వరన్, టిఎస్‌. సెల్వగణేశన్, ఎస్‌.జి. సంబంధన్‌లు కలిసి ఈ సంపత్‌ వినాయకుడు దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు.

Related News

ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఆలయానికి భక్తులకసంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత 1996లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. తర్వాత కాలక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా గ్రూప్‌-1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఆ ఆలయం ఎదిగింది.

విశాఖ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ప్రతి బుధవారం ఈ ఆలయానికి భక్తులతాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయం వద్ద గణేష్‌ ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తుంటారు..

నిత్యం ప్రత్యేక పూజలు..!

ఈ సంపత్‌ వినాయకుడిని ప్రతినిత్యం ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. గరిక పూజ, ఉండ్రాళ్ళ నివేదన, అభిషేకము, గణపతి హోమం, నిత్య పూజలు, వాహన పూజలు, ప్రతీ మాసంలో బహుళ చతుర్థినాడు జరిగే సంకష్టహర చతుర్థి పూజలతో ఆలయం శోభాయమానంగా విలసిల్లుతుంది. వినాయకుడు భోజనప్రియుడు అందుకే ప్రతి రోజు వివిధ రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.

అంతేకాదు అభిషేకాలను చాలా వైభవంగా నిర్వహిస్తారు. గంధోదకం, హరిద్రోదకం, పెరుగు, ఆవుపాలు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు, తేనే, శుద్ధోదకం, పంచధారలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కడుతుంటారు. అభిషేకం అనంతరం స్వామివారికి చేసే అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

వాహనపూజకు ప్రత్యేకం..!

ఈ సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో వాహన పూజకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. విశాఖ నగరంలో లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కొత్త వాహనము కొనుగోలు చేస్తే తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అలా పూజ చేయించడం సర్వశుభప్రదమని..తమకు ఎలాంటి హానీ కలగదని భక్తుల నమ్మకం. అందుకే, ఈ ఆలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

ఇదీ చదవండి : కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రత్యేక వ్యూహం.. ఏడాది లో పూర్తి చేసే ప్లాన్

దర్శన వేళలు:

ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8.30 వరకు.

హోమం సమయం : ఉ.5 గంటల నుంచి 7గంటల వరకు

అభిషేక సమయం: ఉదయం 7 గంటల నుంచి 8.30 వరకు.

అన్నదానము: మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిర్వహించబడుతుంది. అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ చేయాలనుకున్న భక్తులు .తమ విరాళాలను ఆలయ కార్యాలయంలో చెల్లించి రశీదు పొందాలి.

అడ్రస్‌: సంపత్‌ వినాయకుని ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌-530004.

ఎలా వెళ్లాలి: ఆర్టీసీ కాంప్లెక్స్‌కి అతిసమీపంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఆటో, బస్సు సౌకర్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

Related News