Bommalamma Jona: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!

కురుక్షేత్ర యుద్ధవీరులైన పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆ నివాస స్థలాల్లో బొమ్మాలమ్మ జోన ప్రాంతం ఒకటి. ఇక్కడ పాండవులు సంచరించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉంది. ఈ బొమ్మాలమ్మ జోన ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారన్న నమ్మకం.

ఇక్కడ పాండవులు గుహ ఏర్పాటు చేసుకున్నారని దానికి రెండు దారులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆ గిరిజనుల దైవం బొమ్మాలమ్మ తల్లి అమ్మవారు కూడా ఆ ప్రాంతం లో ఉండటంతో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి, అక్కడ పూజలు చేస్తారు. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, టూరిస్ట్లు వస్తుంటారు.

Related News

భీముడి కుర్చి.

అక్కడ ప్రజలకు వారి పూర్వీకులు చెప్పిన మాటలు ప్రకారం. పాండవులు ఈ ప్రదేశం లో తిరిగారనేందుకు అక్కడున్న పొడవైన సొరంగ మార్గమే గుర్తుటున్నారు. అక్కడ భీముడి కుర్చీ, భీముడి కుడి పాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరోజు భీముడికి కోపం వచ్చి గట్టిగా భూమి మీద పాదం వేశారని.ఆ పాదం అచ్చు ఇప్పటికీ అక్కడ ఉన్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.

నారదతత్వాన్ని తెలిపే చెట్టు

పాండవులు తమ అస్త్రాలను జమ్మిచెట్టు మీద పెట్టుకునేవారని..ఆ చెట్టు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు త్రిమూర్తల ప్రతిరూపాలైన రావి, మర్రి చెట్లు ఇక్కడ ఉన్నాయని..నారదుని తాలుకూ ఓ చెట్టు ఉందని..అది నారదుని తత్వాన్ని బోదించేలా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. నారదుడంటే మనకు తెలిసి ఓ ఇద్దరి మధ్య అగ్గిరాజేసి..నారాయణ నారాయణ అంటూ కడుపునింపుకుంటారు. సరిగ్గా ఆ తత్వాన్ని తెలిపేలా ఈ కొండమీద ఓ చెట్టు ఉంది. అందుకే అందరు దాన్ని నారద చెట్టు అంటారు.

పాండవుల కోనేరు.., చర్మవ్యాధులు పోతాయని నమ్మకం

ఇక్కడ కొండమీద ఓ కోనేరు ఉంది. పాండవులకు సహాయసహకారాలు అందించిన శ్రీకృష్ణుడు గోపికలతో ఆ కోనేరులో జలకాలాడేవారని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు ఈ కోనేటిలో పాండవులు స్నానాలు చేసేవారని ఆదివాసీలు నమ్ముతారు. ఈ కోనేటిలో నీళ్లు ఎప్పటికి ఇంకిపోవని గ్రామ ప్రజలు చెబుతున్నారు.ఈ కోనేరులో మునిగితే ఏమైనా చర్మవ్యాధులు ఉంటే పోతాయని ప్రజల నమ్మకం. కార్తీకమాసంలో వనభోజనాలు చేసేందుకు, కార్తీక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

పాండవులకు ప్రత్యేక పూజలు

ఈ ప్రాంతంలో భీముడు, అర్జునులను యోధులుగా పూజిస్తారు ఆదివాసీలు. అక్కడ పిల్లలకు కూడా ఎక్కువగా భీముడు, అర్జునుల పేర్లు పెడుతుంటారు. అంతేకాదు వారిని దైవంగా భావిస్తూ ,అక్కడ వున్న బొమ్మలమ్మ తల్లి దగ్గర పాలు పొంగించి పొలం పనులు ప్రారంభిస్తారు. ఏటా విత్తనాలకు ఇక్కడ పూజచేశాకే చేలల్లో చల్లుతారు. చేతికొచ్చిన కొత్తపంటకు ఇక్కడ పూజ చేస్తారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

కొత్తహంగులతో బొమ్మాలమ్మజోన

బొమ్మాలమ్మ జోనకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో అక్కడ గ్రామస్తులే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దేవాడ వరప్రసాదరావు అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో మెట్ల నిర్మాణం చేపట్టారు. బొమ్మాలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. చీమలపాడు, జెడ్‌ కొత్తపట్నం గ్రామసర్పంచ్‌లు చర్చించి..ఆ ప్రాంతంలో బొమ్మాలమ్మ అమ్మవారి గుడికి, పాండవుల గృహాలకి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు.ప్రభుత్వం కూడా తమకు సహాయం చేస్తే ఈప్రాంతం మరింతగా అభివృద్ధి చేయోచ్చంటున్నారు గ్రామపెద్దలు.

ఇదో చక్కని పర్యాటక ప్రాంతం

కొండకోనలు, పచ్చని వాతావరణంతో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తీకమాసం సమయంలో మంచుతో ఈ ప్రాంతం ఇంకా కనువిందుచేస్తుందని..ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు. గత రెండు మూడేళ్లుగా ఈ ప్రాంతం గురించి ఆ నోట ఈ నోట ప్రచారం జరగడంతో. పక్క జిల్లాల వాళ్లు కూడా అక్కడకు ఫ్యామిలీలతో వెళ్తున్నారు.

బొమ్మాలమ్మ- భీమార్జునుల చల్లని దీవెన

భీమార్జునుల ఆశీస్సులతో, బొమ్మాలమ్మవారి చల్లని దీవెనలతో అనుకూలమైన వ్యవసాయ కాలం ఉంటుందనేది ఆదివాసీల అపార నమ్మకం. ఇక్కడ పూజ చేయిస్తేనే పంట బాగా పండుతుందని, వర్షాలు బాగా పడతాయని అక్కడి పెద్దలు చెప్తున్నారు.

ఎలా వెళ్లాలి?

ఈ ప్రాంతానికి వెళ్లాలంటే వైజాగ్‌ వరకు బస్సు, రైలు, విమాన మార్గం ద్వారా వెళ్లొచ్చు. కానీ అక్కడ నుంచి బస్సులో చోడవరంకు వెళ్లాలి. అక్కడ నుంచి నుండి నర్సీపట్నం వెళ్ళే మార్గ మధ్యలో కొత్తకోట గ్రామం వస్తుంది. కొత్తకోట నుండి చీమలపాడు గ్రామానికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చీమలపాడు గ్రామంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది.

చూడదగ్గ మరికొన్ని ప్రాంతాలు

దీనికి దగ్గరలో అరకు, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడకు వెళ్లే వాళ్లకు కూడా బహుశా ఈప్రాంతం గురించి ఇప్పటివరకు తెలిసి ఉండకపోచ్చు.. ఈ సారి మీరు అటు వెళ్లినప్పుడు ఈ బొమ్మలమ్మజోనను కూడా సందర్శించిరండి.

Related News