టెన్త్‌తో ఆగి… ఆపైన అడ్డా కూలీ దశ నుంచి… సింగరేణి సీఎండీ కుర్చీ దాకా…

అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పాట వింటే ఇప్పటికి ఉత్సహమే కలుగుతుంది .. పని చేయాలనే కసి పెరుగుతుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మా…
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు…
తరతరాలకి తరగని వెలుగౌతారు.

ఈ పాట ప్రస్తుత సింగరేణి సి & ఎండీ బలరాం నాయక్ గారికి వర్తిస్తుంది. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాదభీమా పథకం ప్రారంభించిన సందర్బంగా సింగరేణి ఉద్యోగగణం ఆయన్ని అభినందిస్తోంది..

Related News

ఒక కార్మికుని కష్టం మరొక కార్మికునికి మాత్రమే అర్ధమవుతుంది .. ఒక ఇంటి పెద్దకు ఎమన్నా అయితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేది ఒక మధ్యతరగతి కుటుంబ వ్యక్తి కి మాత్రమే తెలుస్తుంది .. నిజం చెప్పాలంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణిలో ఎవరూ చెయ్యని .. ఊహకందని పథకాన్ని ప్రవేశ పెట్టడం ఆ గొప్పతనం ఒక బలరాం గారికి చెందుతుంది ..

ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుండి సి & ఎండి స్థాయి వరకు ఎదగడం మామూలు విషయం కాదు …

ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి, హైదరాబాద్ కి పొట్ట చేత పట్టుకొని వచ్చి, నల్లకుంటలో , అంబర్పేటలో, చే నెంబర్ లో అడ్డా కూలి నుండి కసిగా చదివి, దేశంలోనే ఉన్నత పరీక్షలో ఒకటైన సివిల్ సర్వీసెస్ లో ఐఆర్ఎస్ లో సెలెక్ట్ అయ్యి, వివిధ విభాగాల్లో పని చేసి, ఈరోజు కొన్ని వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యారు ..

బలరాంనాయక్‌ది రాజాపూర్ మండలం, తిరుమలగిరి తండా.. పేదరికంతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. అయితేనేం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సింగరేణి సీఎండీ బలరాంనాయక్.. హన్యానాయక్, కేస్లీ దంపతులు మొదటి సంతానం బలరాంనాయక్.

వీరిది నిరుపేద కుటుంబం కావడంతో బలరాం నాయక్ సొంత తండా తిరుమగిరిలో 1 నుంచి 4వ తరగతి చదివారు. ఆ తర్వాత 5 నుంచి 8 వరకు నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని పెద్దరేవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో, 9 నుంచి 10 వరకు జడ్చర్లలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ జడ్చర్లలోని కాకతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్.. 19 ఏళ్లకే పెళ్లి, పిల్లలు… పవర్ కట్ ఉంటే అపార్ట్‌మెంట్లలో ఆరో ఫ్లోర్ వరకు సిలిండర్లు మోసుకెళ్లిన ఉదాహరణలు కూడా ఉన్నాయట… ఒక్కడే 18 వేల మొక్కలు నాటాడు…

తండ్రికి తోడుగా ఉంటూ ఆటో నడుపుతూ.. గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి వేస్తూ.. ఇంటర్ తో పాటు ఓపెన్లో డిగ్రీ పూర్తిచేసి 2010లో సివిల్స్ 834 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు.

అసిస్టెంట్ కమిషనర్.. బలరాంనాయక్ ముందుగా 2012లో అసిస్టెంట్ కమిషనర్గా మేడ్చల్ డివిజన్లో బాధ్యతలు స్వీకరించి.. ముంబయిలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సయిజ్ కమిషనర్గా పనిచేశారు. అక్కడ ఏడేళ్లు పనిచేసిన తర్వాత 2019లో సింగరేణికి వచ్చి.. 2023 వరకు సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్) గా పనిచేశారు.

తాజాగా సింగరేణి సీఎండీగా బాధ్యతలు తీసుకున్న బలరాంనాయక్ సింగరేణి కార్మికులకు ఎదో చెయ్యాలనే సంకల్పం .. ఆ దిశలో మొదటి అడుగు కోటి రూపాయల ప్రమాదబీమా .. ఆయనకు సొంత తండా అంటే అమితమైన ప్రేమ. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. పాఠశాల విద్యా ర్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పాటు ఇతరత్రా అవసరమైన వస్తువులను తోటి మిత్రులతో కలిసి అందజేస్తారు…. (రచయిత -చాట్లపెల్లి పురుషోత్తం)

(ఇది ఒక సక్సెస్ స్టోరీ… ఓ ఆటో డ్రైవర్ ఏకంగా సింగరేణి వంటి సంస్థకు సీఎండీ పోస్టు దాకా ఎదగడం మామూలు విషయమేమీ కాదు… అదీ టెన్త్ వరకు మాత్రమే రెగ్యులర్ స్కూలింగ్‌తో… పైన ఉన్న కథనం ఓ వాట్సప్ గ్రూపులో కనిపించింది… ఇంకా వివరాలు స్టడీ చేస్తే మరిన్ని నిజాలు, విషయాలు తెలిసేవేమో… కానీ ఇది చాలు తన ఎదుగుదలను పట్టి చూడటానికి… అభినందనలు బలరాం నాయక్… కీప్ గోయింగ్…

ఇంతకుముందు ఆ ప్లేసులో ఉన్న ఐఏఎస్ మీద బోలెడు ఆరోపణలు… ఆ ప్లేసులోకి బలరాం నాయక్ రావడం కూడా ఓ పాజిటివ్ వైబ్… మా హీరో ఇది పీకాడు, అది పీకాడు, తోపు, తురుం అనే పిచ్చి భక్తిభావజాలం నుంచి బయటపడి ,ఇలాంటి రియల్ హీరోల గురించి కదా చదవాల్సింది… మొన్న 12 ఫెయిల్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది, ఈయన స్టోరీ ఏమీ తక్కువ కాదు… ఎక్కువే…)

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *